మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కోహ్లీ టార్గెట్ గా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడు. తాగాజా మరోసారి కింగ్ కోహ్లీపై అలాంటి వ్యాఖ్యలే చేసి అక్కసు వెళ్లగక్కాడు. టీ20 లో మంచి ఫామ్ లో ఉన్న కోహ్లీపై నోరు పారేసుకున్నాడు. విరాట్ కంటే సూర్యకుమార్ యాదవే గొప్ప బ్యాట్స్ మన్ అంటూ సూర్యను కొనియాడాడు. అతని కంటే బెస్ట్ బ్యాట్స్ మన్ టీమిండియా జట్టులో ప్రస్తుతం లేదని గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. తాను ఎందుకు అంటున్నానో కూడా వివరించాడు గంభీర్. రోహిత్ శర్మ, రాహుల్, విరాట్ మాదిరిగా పవర్ ప్లేలో బ్యాటింగ్ చేసే అవకాశం సూర్యకు రాదన్నారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగే సూర్యకుమార్ యాదవ్ కు ఫీల్డర్లు బౌండరీల వద్ద ఉంటారని, అలాంటి సమయంలో బౌండరీలు బాదడం మామూలు విషయం కాదన్నారు. క్రీజ్ లోకి రాగానే సిక్స్ కొట్టే సామర్థ్యం కూడా బహూషా ఆయనకే ఉందని చెప్పాలన్నాడు.
ఈవిధంగా విరాట్, రాహుల్, రోహిత్ ఆడలేరని వెల్లడించారు. భారత్ బ్యాట్స్ మన్ లైనప్ లో సూర్యకుమార్ యాదవ్ కు మాత్రమే మిగిలిన బ్యాట్స్ మన్ల ఒత్తిడిన తగ్గించే సత్తా ఉందని చెప్పారు. అందుకే అతన్ని బెస్ట్ బ్యాటర్ అన్నానని చెప్పాడు. ఇటీవల నెదర్లండ్స్ తో జరిగిన మ్యాచ్ ను గమనిస్తే క్రీజ్ లోకి సూర్యకుమార్ యాదవ్ అడుగు పెట్టీ పెట్టగానే బౌండరీలు కొట్టడంతోనే కోహ్లీపై ఒత్తిడి తగ్గిందని చెప్పుకొచ్చారు. కోహ్లీ మంచి ప్లేయరే కావచ్చు.. కానీ బెస్ట్ బ్యాట్స్ మన్ మాత్రం కాదన్నారు.
ఇక సూర్యకుమార్ తో పాటు హార్థిక్ పాండ్యా నిలకడగా రాణిస్తే టీమిండియా టీ20 కప్పు కొట్టడం పెద్దగా కష్టమైన పని కాదని సూచనలు చేశాడు. గంభీర్ వ్యాఖ్యలతో కోహ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారంట. వీళ్లిద్దరూ కూడా ఢిల్లీకి చెందిన ఆటగాళ్లే కావడం ఇక్కడ విశేషం.