Telangana Rains: వినాయక చవితి పర్వదినం వేళ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కొనసాగుతుండటంతో కొద్ది రోజులుగా వానల కోసం ఎదురుచూస్తున్న రైతులకు కొంత ఊరట లభించింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట పొలాలు తడిసిపోయాయి. వ్యవసాయ పనులకు ఈ వర్షాలు ఉపయోగపడుతున్న నేపథ్యంలో రైతులు ఉపశమనం పొందుతున్నారు.
మరోవైపు హైదరాబాద్ నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో కుండపోత
కూకట్‌పల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, బాలానగర్, అల్వాల్, గాజులరామారం ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది.
అంబర్‌పేట్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రాజేంద్రనగర్, మణికొండ, టోలిచౌకి తదితర ప్రాంతాల్లోనూ వర్షం జోరుగా కురిసింది.
ప్రధాన రహదారులపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఈ పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని నగరవాసులకు అధికారులు సూచించారు.
Telangana Rains: ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు
వర్షంలో ఎక్కువసేపు తడవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.
బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా రెయిన్‌కోట్ వెంట ఉంచుకోవడం మంచిది. తడిసిన బట్టలతో ఎక్కువసేపు ఉండకుండా వీలైనంత త్వరగా పొడి బట్టలు ధరించాలని సూచిస్తున్నారు.
Also Read: Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక కాలేదా? రూ.10 వేల డిపాజిట్ తిరిగి ఖాతాలోకి
నీరు, ఆహారం విషయంలో అప్రమత్తత
వర్షాకాలంలో కలుషిత నీటి ద్వారా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అందువల్ల కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచిస్తున్నారు.
వీధి పక్కన బహిరంగంగా విక్రయించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండి, ఇంట్లో తాజాగా తయారు చేసిన వేడి ఆహారం తీసుకోవడం మంచిదని పేర్కొంటున్నారు.
విద్యుత్ వైర్లు, తడిసిన గోడలకు దూరంగా ఉండాలి
రోడ్లపై తెగిపడిన విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంట్ స్తంభాలు, తడిసిన గోడల దగ్గరకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇంట్లో విద్యుత్ స్విచ్‌లను ఉపయోగించేటప్పుడు చేతులు పొడిగా ఉన్నాయో లేదో చూసుకోవాలని సూచిస్తున్నారు.
వాహనదారులు వేగం తగ్గించాలి
వర్షం కారణంగా రోడ్లపై గుంతలు కనిపించకుండా ఉండే అవకాశం ఉంది. అందువల్ల వాహనదారులు వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలి.
అదే సమయంలో ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం అవసరం. నిల్వ నీటిలో దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉండటంతో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులు సూచిస్తున్నారు.




