Kotha Jaipal Reddy: రాస్ అల్ ఖైమా (యూఏఈ): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పే బోనాల పండుగను ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. జూలై 19, 2026 ఆదివారం రాస్ అల్ ఖైమాలోని మైత్రి ఫార్మ్స్లో జరిగిన ఈ మహోత్సవం యూఏఈలో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసులకు సొంత ఊరి బోనాల వేడుకలను గుర్తు చేసింది. వేడుకలకు మైత్రి గ్రూప్ వ్యవస్థాపకులు శ్రీ కొత్త జైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు బోనాలు, బతుకమ్మ వంటి పండుగలను ఘనంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. సేవా కార్యక్రమాలతో పాటు తెలంగాణ సంస్కృతిని భావితరాలకు చేరవేస్తున్న ETCA సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దుబాయ్, అబుదాబి, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ ఖువైన్, రాస్ అల్ ఖైమా, ఫుజైరా తదితర ఎమిరేట్స్ నుంచి సుమారు 400 మంది తెలంగాణ ప్రవాసులు కుటుంబ సమేతంగా హాజరై భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఇది ETCA ఆధ్వర్యంలో వరుసగా నాలుగోసారి నిర్వహించిన బోనాల మహోత్సవం కావడం విశేషం. కార్యక్రమం సంప్రదాయబద్ధంగా గౌరమ్మ పూజతో ప్రారంభమైంది. అనంతరం శ్రీ మహంకాళి అమ్మవారిని సుందరంగా అలంకరించి వేద మంత్రోచ్చారణల నడుమ దీపప్రజ్వలన, ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ, కుంకుమార్చన, అష్టోత్తర శతనామార్చన, మహా హారతులు నిర్వహించారు. భక్తులు నైవేద్యాలు సమర్పించి ఒడి బియ్యం, కుంకుమ, జిల్లేడు ఆకులు, ఎర్ర చీరలు, బెల్లం తదితర సంప్రదాయ కానుకలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.
యూఏఈలో తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బోనాల మహోత్సవం
ఈ వేడుకలో మహిళలు పట్టు చీరలు ధరించి, రంగురంగుల పూలతో అలంకరించిన బోనాలను తలపై మోసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన బోనాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒగ్గు డోలు మోతలు, పోతురాజుల విన్యాసాలు, జానపద వాయిద్యాల సందడి మధ్య సాగిన ఊరేగింపు యూఏఈ ఎడారి నేలపై తెలంగాణ పల్లె వాతావరణాన్ని ఆవిష్కరించింది. మహిళలు సంప్రదాయబద్ధంగా వాయనం కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ ఆచార వ్యవహారాలను ప్రతిబింబించారు.
ప్రవాస తెలంగాణీయుల ఐక్యతకు వేదికగా ETCA సేవలు
ఈ సందర్భంగా ETCA వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ కిరణ్ కుమార్ పీచర, అధ్యక్షుడు శ్రీ జగదీష్ రావు మాట్లాడుతూ, యూఏఈలో జన్మించి పెరుగుతున్న భావితరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల గొప్పతనాన్ని పరిచయం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బోనాలు తెలంగాణ భక్తి, ఐక్యత, సంస్కృతికి ప్రతీక అని పేర్కొంటూ, ప్రతి ఏడాది మరింత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.
ఈ మహోత్సవం విజయవంతం కావడానికి సహకరించిన LSPMK గ్రూప్ చైర్మన్ రాధారపు సత్యం, ఫోటోగ్రఫీ, వీడియో సేవలు అందించిన లెమన్ స్టూడియో రమేశ్, విరాళాలు అందించిన ETCA సభ్యులు, శ్రేయోభిలాషులు, వాలంటీర్లు, కళాకారులు మరియు కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం నిర్వహించిన దీపోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సామూహిక హారతితో కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా ముగించి, మహాప్రసాదం పంపిణీ చేశారు. అలాగే సంప్రదాయ తెలంగాణ వంటకాలతో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
విదేశాల్లో ఉన్నామనే భావనే కలగకుండా స్వగ్రామంలో బోనాల పండుగను జరుపుకున్న అనుభూతి కలిగిందని తెలంగాణ ప్రవాసులు ఆనందం వ్యక్తం చేశారు. భక్తి, భాష, సంస్కృతి, సంప్రదాయం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిర్వహించిన ఈ బోనాల మహోత్సవం యూఏఈ తెలంగాణ ప్రవాస సమాజానికి చిరస్మరణీయమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ETCA కార్యవర్గ సభ్యులు, మహిళా విభాగం, వాలంటీర్లు, తెలంగాణ ప్రముఖులు మరియు యూఏఈ నలుమూలల నుంచి వచ్చిన ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.