Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు మరింత నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు ఇకపై ముద్దగా కాకుండా చక్కగా ఉడికిన స్టీమ్ రైస్ అందించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ నిర్ణయం విద్యార్థుల ఆరోగ్యం, ఆహార నాణ్యతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న అక్షయపాత్ర ఫౌండేషన్ కిచెన్ను సందర్శించి అక్కడ తయారవుతున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, వంట విధానం, బియ్యం వినియోగం వంటి అంశాలపై అధికారులు, అక్షయపాత్ర ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
ఇటీవల కొన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి మధ్యాహ్న భోజనంలో అందిస్తున్న అన్నం ముద్దగా వస్తోందనే ఫిర్యాదులు ప్రభుత్వ దృష్టికి వచ్చాయి. దీనిపై స్పందించిన అక్షయపాత్ర సిబ్బంది.. ప్రస్తుతం సరఫరా అవుతున్న కొత్త బియ్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతోందని మంత్రికి వివరించారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి, అక్షయపాత్రకు సరఫరా అవుతున్న బియ్యం రకం, నాణ్యత, సరఫరా విధానంపై పూర్తి నివేదికను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో సుమారు 63 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. లక్షలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాహారం అందించే ఈ కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. ప్రభుత్వ సహకారంతో పాటు సమాజ సేవా దృక్పథంతో సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు.
విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసిన మంత్రి, త్వరలోనే స్టీమ్ రైస్ సరఫరా ప్రారంభిస్తామని తెలిపారు. దీనివల్ల అన్నం మెత్తగా, విడివిడిగా ఉడికి రుచిగా ఉండటంతో పాటు విద్యార్థులు సులభంగా తినగలరని అధికారులు భావిస్తున్నారు. అలాగే పోషకాహార ప్రమాణాలను మరింత మెరుగుపరిచే చర్యలు కూడా కొనసాగుతాయని వెల్లడించారు.
ఇక అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రస్థానం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. 2000 సంవత్సరంలో బెంగళూరులో కేవలం 1,500 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమం నేడు విశాల స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం దేశంలోని 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రోజూ సుమారు 23.50 లక్షల మంది విద్యార్థులకు వేడి, పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అందిస్తోంది.
ఇటీవల సంస్థ మరో చారిత్రాత్మక ఘనతను కూడా నమోదు చేసింది. 2024లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో 400 కోట్ల భోజనాల మైలురాయిని జరుపుకున్న అక్షయపాత్ర, 25 ఏళ్ల ప్రస్థానంలోనే దేశవ్యాప్తంగా 500 కోట్ల భోజనాల పంపిణీ పూర్తి చేసి కొత్త రికార్డు సృష్టించింది. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఘనతను రాష్ట్రపతి సమక్షంలో నిర్వహించడం విశేషం.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ సహా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల ఆకలి తీర్చడంలో అక్షయపాత్ర ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన స్టీమ్ రైస్ నిర్ణయం అమల్లోకి వస్తే విద్యార్థులకు మరింత నాణ్యమైన, ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనం అందే అవకాశం ఉందని విద్యా, పోషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.