Bigg Boss Telugu 10 : బుల్లితెర ప్రేక్షకులను ఎన్నో సంవత్సరాలుగా అలరిస్తున్న రియాలిటీ షోల్లో బిగ్ బాస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సహా దేశంలోని అనేక భాషల్లో ఈ షో విజయవంతంగా ప్రసారమవుతూ భారీ అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది. వివాదాలు, భావోద్వేగాలు, టాస్కులు, అనూహ్య ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ షో ఇప్పటికే తెలుగులో తొమ్మిది సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ప్రేక్షకులందరి దృష్టి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10పై పడింది.
తాజా సమాచారం ప్రకారం, గత సీజన్లతో పోలిస్తే ఈసారి షోను కాస్త ముందుగానే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రోమో షూటింగ్ కూడా పూర్తయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు ప్రారంభమై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సీజన్‌ను మరింత ప్రత్యేకంగా రూపొందించేందుకు నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2’ నిర్వహించే అవకాశముందని టాక్ నడుస్తోంది. ఈ కార్యక్రమానికి శివాజీ, గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్ లేదా అభిజిత్ వంటి మాజీ కంటెస్టెంట్లు, విజేతలు జడ్జీలుగా వ్యవహరించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రక్రియ ద్వారా ఎంపికైన ఐదుగురు కామనర్స్ నేరుగా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం.
అయితే అగ్నిపరీక్ష సీజన్ 2కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. పాల్గొనే విధానం, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వంటి వివరాలను త్వరలోనే నిర్వాహకులు వెల్లడించే అవకాశం ఉంది.
ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్ల విషయానికి వస్తే, సోషల్ మీడియాలో అనేక పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉన్నవారితో పాటు వివాదాస్పద వ్యక్తులను కూడా ఈసారి హౌస్‌లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో పల్లవి గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, నందూస్ వరల్డ్ నందూ, పండు మాస్టర్, జ్యోతి, రాయల్ మెక్ రమణ, తేజస్విని గౌడ, శివ్ కుమార్, పవన్ కళ్యాణ్, కడలి సత్యనారాయణ, ఈటీవీ ప్రభాకర్ మరియు హీరో చంద్రహాస్ ఉన్నారు.
అయితే ఈ పేర్లన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నవే తప్ప అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. కొందరికి బిగ్ బాస్ టీమ్ నుంచి సంప్రదింపులు జరిగాయని, మరికొందరు షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారని వార్తలు వస్తున్నాయి.
మొత్తంగా చూస్తే, బిగ్ బాస్ తెలుగు సీజన్ 10పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సీజన్ ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.