Indiramma Indlu: తెలంగాణ ప్రభుత్వం పేదలకు గృహ భద్రత కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో నివసిస్తున్న అర్హులైన పేద కుటుంబాలకు దశలవారీగా ఒక లక్ష LIG (Low Income Group) ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇప్పటికే పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు.
జూలై 20న ఇందిరమ్మ LIG ఇండ్ల పథకం ప్రారంభం
సచివాలయంలో హౌసింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీన క్యూర్ పరిధిలో ఇందిరమ్మ LIG ఇండ్ల పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులతో కలిసి పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు చెప్పారు. దరఖాస్తుల స్వీకరణ విధానం, అర్హతలు, టెండర్ల ప్రక్రియ, నిర్మాణ నమూనా వంటి అన్ని వివరాలను అదే రోజు ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు.
తొలి దశలో ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్లు
2026-27 ఆర్థిక సంవత్సరంలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, తొలి దశలో ప్రతి నియోజకవర్గంలో కనీసం 500 ఇళ్లను నిర్మించనుంది. స్థానిక అవసరాలను బట్టి కొన్ని ప్రాంతాల్లో ఈ సంఖ్యను 1,000 ఇళ్ల వరకు పెంచే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
గతంలో నగరానికి దూరంగా నిర్మించిన గృహాల్లో నివసించడానికి లబ్ధిదారులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ప్రజలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోని ప్రభుత్వ భూములపై ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉపాధి, పిల్లల విద్య, వైద్య సేవలు, రవాణా వంటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాశ్వత నివాసం కల్పించడమే కాకుండా, లబ్ధిదారులకు ఆస్తిపై యాజమాన్య హక్కు కూడా లభించనుంది.
ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో అవసరమైన ప్రభుత్వ స్థలాలను గుర్తించిన హౌసింగ్ శాఖ, భవనాల డిజైన్లు, అంతస్తుల సంఖ్య, ప్లాట్ విస్తీర్ణం వంటి అంశాలపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది.
ఇదిలా ఉండగా, లక్ష ఇందిరమ్మ ఇళ్ల ప్రకటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇటీవల నిర్వహించిన ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల్లో అధిక శాతం హౌసింగ్ శాఖకే సంబంధించినవి కావడం ఈ పథకంపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని స్పష్టంగా తెలియజేస్తోంది. దరఖాస్తుదారుల సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.